ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి గతంలో హర్యానాలో ఓ హత్య కేసులో కూడా ప్రమేయం ఉంది. నిందితుడి వద్ద నుంచి 30 లక్షల విలువైన 102 అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌లతో సహా 163 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మార్చి 1న అంతర్రాష్ట్ర దొంగల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం మేరకు జ్యోతి నగర్, గురుద్వారా సమీపంలోని ఎల్‌ఐజీ ఫ్లాట్స్ వద్ద పోలీసు సిబ్బందిని మోహరించారు. సాయంత్రం 4.40 గంటల సమయంలో నిందితుడి చేతిలో బూడిదరంగు బ్యాగ్ తో అక్కడికి వచ్చాడు. అతడిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికప్పుడు అతడి దగ్గర ఉన్న 14 సరికొత్త హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, అతను ఫిబ్రవరి 26న షహ్ద్రాలోని ఒక దుకాణంలో ఫరూఖ్, జీషాన్‌ల సహాయంతో మొబైల్ ఫోన్‌లను దొంగిలించాడని అతను అంగీకరించాడు. దుకాణం గేటును పగలగొట్టడానికి వారు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారని తెలిపారు. ఆ తర్వాత సుందర్ నగ్రిలోని అతని అద్దె నివాసం నుండి 88 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించిన గ్యాస్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు పాల్పడిన అతని ఇతర సహచరులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆపరేషన్ 'అంకుష్'
పెరుగుతున్న దోపిడీలు, స్నాచింగ్ సంఘటనల దృష్ట్యా, దేశ రాజధానిలో నేరాలను అరికట్టడానికి ఢిల్లీ పోలీసులు 'అంకుష్' పేరుతో ఆపరేషన్ ప్రారంభించారు. మానవ మేధస్సు, సాంకేతిక వనరుల సహాయంతో ప్రత్యేక బృందం మొబైల్ ఫోన్ల దోపిడీకి పాల్పడుతున్న నేరగాళ్ల సమాచారాన్ని సిబ్బంది సేకరించింది. మూడు వేర్వేరు కేసుల్లో ఐదుగురు నేరగాళ్లను అరెస్టు చేశారు. వారం రోజుల్లోనే 163 అత్యాధునిక స్మార్ట్ ఫోన్లను రికవరీ చేశారు.