ఢిల్లీ పోలీసు అధికారిని తన మామను చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం ఢిల్లీలోని లక్ష్మీ నగర్‌లోని ఓ నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగినప్పుడు మరో పోలీసు అక్కడే ఉన్నాడు. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న ఆమె.. అత్తమామలకు వ్యతిరేకంగా కోర్టులో పోరాటం చేస్తోంది. వివాదం నడుస్తూ ఉండగానే మహిళా పోలీసు తన మామను చెంపదెబ్బలు కొట్టింది. అక్కడే ఉన్న మహిళ.. మరో పోలీసు ఆమెను వారించారు.
వృద్ధుడికి మరియు ఆమె తల్లికి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో మహిళ దాడి చేసిందని నివేదిక పేర్కొంది. అక్కడే ఉన్న ఇతర పోలీసు జోక్యం చేసుకునేలోపు సివిల్ డ్రెస్‌లో ఉన్న మహిళా పోలీసు అధికారి ఆ వ్యక్తిపై అనేకసార్లు దాడి చేయడం వీడియోలో కనిపిస్తుంది. వాగ్వాదం తర్వాత కూడా ఇంట్లో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీడియో వైరల్ కావడంతో సబ్ ఇన్‌స్పెక్టర్‌పై ఐపీసీ సెక్షన్ 323/427 కింద కేసు నమోదు చేశారు. మహిళా అధికారిపై తగిన శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు.