పొరుగింటిపైకి ప్ర‌మాద‌క‌ర‌మైన కుక్క‌ను వ‌దిలిన వ్య‌క్తి.. గొడ‌వ ఏమిటంటే..?

ఢిల్లీలో సోమవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. వెల్‌కమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బైక్‌ను ఇంటి బయట నుంచి తీసే విషయంలో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య వాగ్వాదం జరిగింది.

By -  Medi Samrat
Published on : 16 Sept 2025 10:32 AM IST

పొరుగింటిపైకి ప్ర‌మాద‌క‌ర‌మైన కుక్క‌ను వ‌దిలిన వ్య‌క్తి.. గొడ‌వ ఏమిటంటే..?

ఢిల్లీలో సోమవారం రాత్రి దారుణం వెలుగు చూసింది. వెల్‌కమ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బైక్‌ను ఇంటి బయట నుంచి తీసే విషయంలో ఇద్దరు ఇరుగుపొరుగు వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్ర‌మంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి పొరుగున నివసిస్తున్న ఐదుగురిని కర్రలతో కొట్టడంతో పాటు ప్రమాదకరమైన జాతికి చెందిన రోట్‌వీలర్ కుక్కను కూడా వారిపైకి వదిలాడు. కుక్క ఐదుగురినీ తీవ్రంగా కరిచింది. ఘటన అనంతరం ఆ వ్య‌క్తి కుక్కతో పారిపోయాడు. క్షతగాత్రులను జీటీబీ ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులు అక్క‌డ‌ చికిత్స పొందుతున్నారు. వెల్‌కమ్‌ పోలీస్‌స్టేషన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు కుక్క వివ‌రాలు కార్పొరేషన్‌లో నమోదు చేయలేదు.

వివ‌రాల ప్ర‌కారం.. చేతన్ రాథోడ్ సుభాష్ పార్క్‌లో నివసిస్తున్నాడు. రాత్రి 11:30 గంటల సమయంలో తన తండ్రి అరవింద్ రాథోడ్ వీధిలో పార్క్ చేసిన బైక్‌ను ఇంట్లో పార్క్ చేయడానికి వీధిలోకి వెళ్లాడు. పొరుగున ఉండే షాలు స్వామి తన ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై ఇంటి బయట కూర్చున్నాడు. అడ్డంగా ఉన్న బైక్ తీయమని త‌న తండ్రి.. షాలు స్వామిని అడగడంతో అత‌డికి కోపం వచ్చింది. మొదట అత‌డిని దుర్భాషలాడాడు. విషయం తీవ్రం కావడంతో తండ్రి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. చేతన్ షాలుకి ఫోన్ చేసి జరిగిన సంఘటన గురించి అడిగాడు. దీంతో షాలు వీధిలోకి రావాలని కోరారు. చేతన్ రాగానే షాలు అత‌డిని కొట్టాడు.

చేతన్‌ను రక్షించేందుకు కుటుంబ సభ్యులు వచ్చారు. ఇంతలో షాలు కుటుంబ సభ్యులు ఇంటి నుంచి కర్రలు, పెంపుడు కుక్కను తీసుకొచ్చారు. చేతన్, అతని కుటుంబాన్ని కొట్టారు. అనంతరం కుక్కను వారిపైకి వదిలారు. అది వారిపై తీవ్రంగా దాడి చేసింది.

Next Story