ఆటో ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. అయితే విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. డెహ్రాడూన్‌లో సెయింట్ థామస్ స్కూల్‌లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు.. ఆటో కోసం సమీపంలో ఉన్న బస్ స్టాప్‌లో వేచి చూస్తున్నారు. అదే సమయంలో అక్కడ భారీగా వర్షం కురుస్తోంది. కాసేపటికి అక్కడికి ఆటో వచ్చింది. దీంతో తొందరగా ఇంటికి వెళ్లాలనే ఉద్దేశ్యంతో.. విద్యార్థి వర్షపు నీటిలో దిగాడు. ఆటోను టచ్ చేసిన వెంటనే విద్యార్థి కరెంట్ షాక్‌కు గురుయ్యాడు.
ఆ తర్వాత మరో విద్యార్థిని కూడా ఆటో ఎక్కేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురై వరద నీటిలో పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు.. ఇద్దరు విద్యార్థులను కాపాడారు. అదృష్టవశాత్తూ అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అయితే ఈ ఘటన జూలై 13న జరగగా.. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.