షాజహాన్‌పూర్ జిల్లాలోని రోజా స్టేషన్‌లో అమృత్‌సర్‌కు వెళ్లే జనసేవ ఎక్స్‌ప్రెస్ లో తాళం వేసి ఉన్న టాయిలెట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహం ముప్పై ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిదని తెలుస్తోంది. మృతదేహం బీహార్‌లోని బన్‌మంఖీ జంక్షన్ నుంచి షాజహాన్‌పూర్ వరకు దాదాపు 900 కి.మీ.ల పాటు ప్రయాణించినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు (జిఆర్‌పి) సబ్‌ఇన్‌స్పెక్టర్ కరుణేష్ చంద్ర శుక్లా తెలిపారు.
సాధారణ రైలు కంపార్ట్‌మెంట్‌లోని కొంతమంది ప్రయాణికులు వాష్‌రూమ్ నుండి దుర్వాసన వస్తోందని ఫిర్యాదు చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. రైలు సిబ్బంది వాష్‌రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా ఉబ్బిన మృతదేహం కనిపించింది. ఐదు గంటల పాటూ ఆగిన తర్వాత రైలు అమృత్‌సర్‌కు బయలుదేరింది. "ఆ వ్యక్తి ఆకుపచ్చ చొక్కా, నీలిరంగు ప్యాంటు ధరించాడు. అతని దగ్గర మాకు ఎటువంటి ID కార్డ్ దొరకలేదు. ఇతర GRP స్టేషన్‌లతో సమాచారం పంచుకున్నారు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది. బన్మంఖి నుండి రైలు బయలుదేరకముందే వ్యక్తి మరణించి ఉండవచ్చని శవ పరీక్షకు సంబంధించిన రిపోర్టు చెబుతోందని అంటున్నారు. "అని GRP అధికారి తెలిపారు. చనిపోయి కనీసం మూడు రోజులు అయి ఉంటుందని, కుళ్లిపోవడం ప్రారంభమైందని రైల్వే ఆసుపత్రికి చెందిన డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు కనిపించలేదని రాయ్ తెలిపారు.