ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని తెలిసింది.
By అంజి Published on 26 Oct 2023 9:53 AM ISTఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది ఏపీ వాసులు మృతి
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మృతులు టాటా సుమోలో బాగేపల్లి నుంచి బెంగళూరు వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. టాటా సుమో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. వారిలో 12 మంది చనిపోయారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే చిక్కబళ్లాపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. రోడ్డుపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని గోరంట్ల పట్టణానికి చెందిన వారని తెలిసింది. బెంగళూరులోని హొంగసంద్రలో నివాసముంటున్నట్లు సమాచారం. టాటా సుమోలో ఉన్న వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నాడు. కానీ వయస్సు తదితర సమాచారం అందుబాటులో లేదు. ఓ చిన్నారి సహా 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు మరణించారు. వాహనంలో ఉన్న మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డిఎల్ నగేష్ వ్యాఖ్యానిస్తూ..12 మంది మరణించినట్లు ధృవీకరించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని టాటా సుమో డ్రైవర్ చూడలేకపోయాడు. మృతుల బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొందరు చిక్కబళ్లాపూర్‌కు వస్తున్నారు. బంధువులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.