అర్థ‌రాత్రి గ్యాంగ్‌వార్‌.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించారు

By -  Medi Samrat
Published on : 4 April 2026 2:02 PM IST

అర్థ‌రాత్రి గ్యాంగ్‌వార్‌.. ముగ్గురు మృతి

మహారాష్ట్రలోని నాందేడ్ నగరంలో రెండు ప్రత్యర్థి ముఠాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు మరణించారు. పోలీసుల ప్రకారం.. ఈ ప్రత్యర్థి ముఠాల మధ్య చాలాకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో, శుక్రవారం రాత్రి ఒక ముఠాకు చెందిన కొందరు సభ్యులు సినిమా చూసి తిరిగి వస్తుండగా.. వారి కదలికలపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ప్రత్యర్థి ముఠా సభ్యులు వారిని అడ్డగించి దాడి చేశారు. ఈ ఘటన నగరంలోని ఒక మాల్ సమీపంలో తెల్లవారుజామున సుమారు 1.30 గంటలకు జరిగింది.

ఈ ఘటన అనంతరం పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 'సదా గ్యాంగ్', 'సాయి లాలా గ్యాంగ్' సభ్యులు పదునైన ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని పోలీస్ సూపరింటెండెంట్ అవినాష్ కుమార్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మూడో వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన మూడో వ్యక్తిపై శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో దాడి జరగడంతో అతను మరణించినట్లు నాందేడ్ పోలీసులు మీడియాకు తెలిపారు. మృతులను అర్జిత్ సింగ్, సయ్యద్ ఆవాజ్, మహమ్మద్ అర్బాజ్‌గా గుర్తించారు. స్థానిక క్రైమ్ బ్రాంచ్ బృందాలు, ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఇరు పక్షాలూ క్రాస్-ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు.

Next Story