నిజామాబాద్ జిల్లా ఖండ్ ఘావ్ కు చెందిన శ్రీకాంత్ 80 రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. ప్రేమ వ్యవహారంలో కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి అతడి కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వెతుకుతూనే ఉన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. బోధన్ శివారులో కుళ్లిపోయిన స్థితిలో ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. ఆ మృతదేహం చెట్టుకి వేలాడుతూ ఉంది. స్పాట్ లో లభించిన ఆధారాలను బట్టి మృతుడు శ్రీకాంత్ గా గుర్తించారు. విషయం తెలుసుకున్న బంధువులు స్పాట్ కి చేరుకుని ఆందోళన చేపట్టారు. యువతి బంధువులే శ్రీకాంత్ ను చంపారని.. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ధర్నాకు దిగారు.
80 రోజుల క్రితం కాలేజీకి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిన శ్రీకాంత్ కనిపించకుండా పోయాడు. అయితే బోధన్‌కు చెందిన ఓ యువతిని శ్రీకాంత్ ప్రేమించినట్టు స్థానికులు చెబుతున్నారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమంటున్నారు శ్రీకాంత్ తల్లిదండ్రులు. అమ్మాయి తరఫు బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి బంధువులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. బోధన్ రోడ్లపై ఆందోళనలకు దిగారు.