జూబ్లీ హిల్స్ లోని ఖాళీ స్థలంలో దుర్వాసన.. తీరా చూస్తే..!

Dead Body Founded In Jubilee Hills. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ లో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన బయటకు వచ్చింది.

By Medi Samrat  Published on  17 July 2021 3:20 PM IST
జూబ్లీ హిల్స్ లోని ఖాళీ స్థలంలో దుర్వాసన.. తీరా చూస్తే..!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హిల్స్ లో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వ్యక్తిని హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని ఓ హోర్డింగ్‌ వెనుక దాచారు. చనిపోయిన వ్యక్తిని ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన విజిలేష్‌ కుమార్‌(30) గా గుర్తించారు. రెండు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు తెలుస్తోంది. కాచిగూడలోని లియో సెక్యూరిటీ ఏజెన్సీలో సెక్యూరిటీ గార్డ్‌గా చేరాడు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 7లోని ఫోర్‌ వీల్స్‌ ట్రావెల్స్‌కు చెందిన పార్కింగ్‌ స్థలంలోని ఓ గదిలో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఖాళీ స్థలంలో దుర్వాసనలు వస్తున్నాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించగా నిర్మాణంలో ఉన్న భవనం ప్రహారీని ఆనుకున్న ప్రాంతంలో ఓ హోర్డింగ్‌ కనిపించింది.

హోర్డింగ్‌ వెనుకాల కుళ్ళిపోయిన స్థితిలో అతడి మృతదేహం కనిపించింది. హత్య చేసిన దుండగులు ఎవరికీ కనిపించకుండా హోర్డింగ్‌ వెనుకాల మృతదేహాన్ని దాచినట్లు తెలుస్తోంది. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నెల 13 నుంచి విజిలేష్‌ ఉద్యోగానికి వెళ్ళడం లేదని.. అప్పుడే అతడిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తూ ఉన్నారు. అతడిని చంపడానికి గల కారణాలను, చంపింది ఎవరు అనే విషయాలను తెలుసుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




Next Story