ఆస్తి కాగితాలు ఇవ్వడానికి నిరాకరించాడన్న ఆరోపణతో ఓ వ్యక్తిని అతని కుమార్తె కొట్టి చంపింది. మహబూబాబాద్ జిల్లాలో ఆస్తి వివాదంపై 17 ఏళ్ల బాలిక తన తండ్రిని కొట్టిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం వేమునూరు గ్రామంలో వెంకన్న(46) ఒంటరిగా నివాసముంటున్నాడు. కుటుంబ కలహాలతో వెంకన్న భార్య 10 నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఆ తర్వాత ఆయన కూతురు ప్రభావతికి గ్రామంలోని ఓ వ్యక్తితో వివాహం జరిగింది.
ఆస్తి కాగితాలు తనకు అప్పగించాలని ప్రభావతి తండ్రితో వాదించడం ప్రారంభించింది. ఆస్తి పత్రాలు ఇవ్వడానికి వెంకన్న నిరాకరించడంతో ఆగ్రహంతో ప్రభావతి తండ్రిని కొట్టింది. తలకు గాయమైన వెంకన్న అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. గ్రామ ప్రజలు ప్రభావతి నేరాన్ని దాచడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
అయితే.. ఈ ఘటనపై గ్రామస్తులు కొందరు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభావతి మాత్రమే హత్యకు పాల్పడిందా లేక ఆమెకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో ప్రభావతిని అదుపులోకి తీసుకున్నారు. వెంకన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విచారణ అనంతరం నిందితులను త్వరలో కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.