మన చుట్టూ ఉన్న వాళ్లు ఎవరో? ఎక్కడి నుండి వచ్చారో? తెలుసుకోకపోతే ఎలా చెప్పండి. మదనపల్లెలో ఇప్పుడు అలాంటి ఘటనే చోటు చేసుకుంది. దండుపాళ్యం ముఠా సభ్యుడు పేరు మార్చుకుని ఎంచక్కా బతికేస్తున్నాడు. అతడిపై ఏకంగా 13 హత్యలు, దోపిడీ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అతడెవరో కాదు చిక్కహనుమ అలియాస్ చిక్క హనుమంతప్ప అలియాస్ కృష్ణప్ప. దండుపాళ్యం ముఠా సభ్యుడిని 29 ఏళ్ల తర్వాత మంగళూరులోని ఉర్వ పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటె తాలూకా దండుపాళ్యంకి చెందిన నిందితుడు చిక్కహనుమ (55) ప్రస్తుతం ఏపీలోని మదనపల్లె విజయనగర కాలనీలో కె.కృష్ణగా పేరు మార్చుకుని నివసిస్తున్నాడు. మంగళూరు మారిగుడి క్రాస్ వద్ద అన్వర్ మహల్ అనే వ్యక్తి ఇంట్లోకి 1997 అక్టోబర్ 14న అర్ధరాత్రి దండుపాళ్యం ముఠా సభ్యులు ఎనిమిది మంది చొరబడ్డారు. లూవిస్ డిమెల్లో(80), రంజిత్ వేగస్(19) అనే ఇద్దరిని హత్య చేసి దోపిడీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న ఉర్వ పోలీసులు ప్రధాన నిందితుడైన చిక్కహనుమ మినహా మిగతా నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని ఏపీలో గుర్తించి అరెస్టు చేశారు.