తెలుగు మాట్రిమోనియల్ సైట్‌లో యువతిని పరిచయం చేసుకొని రూ. 10 లక్షల రూపాయలు దండుకున్న నైజీరియన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాళ్లోకెళితే.. బేగంపేటకు చెందిన ఓ యువతి తెలుగు మ్యాట్రిమోనీలో తన ప్రొఫైల్ ని అప్డేట్ చేసింది. ఓషర్ ఎబుక విక్టర్ అనే నైజీరియన్ వ్యక్తి తెలుగు మ్యాట్రిమోనీలో యువతి ప్రొఫైల్ చూసి.. నచ్చిందని వలవేశాడు. ఈ మేరకు ఆ అమ్మాయికి తాను యూఎస్‌లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
ఈ క్రమంలోనే యువతికి గిఫ్ట్ పంపించాను అని చెప్పి మోసం చేశాడు ఓషర్ ఎబుక విక్టర్. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారులం అని చెప్పి.. మీకు గిఫ్ట్ రూపంలో డాలర్స్ వచ్చాయని.. అది చట్టవిరుద్ధమని కస్టమ్స్ చార్జెస్ కింద పలు చార్జీలు కట్టాలని ఆ యువతి దగ్గర రూ.10 లక్షల రూపాయలు దండుకున్నాడు ఆ నైజీరియన్. మోసపోయానని గ్రహించిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో నైజీరియన్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. కోర్టులో హాజరుపరిచి ఆపై రిమాండ్ కు తరలించారు.