భార్యను విషపు పాము కాటుతో హత్య చేయించిన ఓ భర్తకు కఠిన కారాగార శిక్ష విధించింది కోర్టు. నిందితుడుకి రెండు జీవితఖైదుల శిక్షను విధిస్తూ కేరళ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన కొల్లాం అడిషనల్ సెషన్స్ జస్టిస్ ఎం మనోజ్ ఈ తీర్పును వెలువరించారు. ఇది అత్యంత అరుదైన కేసు అని ఆయన వ్యాఖ్యానించారు. గత సంవత్సరం మార్చిలో భార్య ఉత్రకి, భర్త సూరజ్‌లకు మధ్య కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో భర్త సూరజ్ భార్యను హత్య చేసేందుకు విషపు పామును వదిలాడు. పాము కాటుతో భార్య ఉత్ర తీవ్ర అనారోగ్యం పాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో 52 రోజు పాటు చికిత్స తీసుకున్నాక ఉత్ర కోలుకుంది.
దీంతో మళ్లీ రూ.10 వేలు పెట్టి మరోసారి పాములు పట్టే అతడిని పిలిపించి భార్యపైకి మళ్లీ పామును వదిలాడు. అయితే ఈ సారి విషపు పాము కాటుతో భార్య ఉత్ర మరణించింది. కూతురు మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ దారుణం బయటపడింది. ఈ కేసులో పాములు పట్టే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లుగా పాములు పట్టే వ్యక్తి పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టారు. నిందితుడు సూరజ్‌కు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరారు. అయితే కోర్టు మాత్రం రెండు జీవితఖైదు శిక్ష వేసింది. అలాగే రూ. 5 లక్షల జరిమానా విధించింది.