నిద్రపోతే ఎలా సార్..? కొన్ని మీటర్ల దూరంలోనే హత్య జరిగితే..!
పోలీసులు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్నారు. అయితే వారు నిద్రపోతూ ఉన్నారు.
By Medi Samrat
పోలీసులు కేవలం కొన్ని మీటర్ల దూరంలో ఉన్నారు. అయితే వారు నిద్రపోతూ ఉన్నారు. తీరా ఓ దారుణమైన హత్య చోటు చేసుకుంది. అహ్మదాబాద్‌లో పోలీస్ కంట్రోల్ రూమ్ (PCR) వాహనంలో పోలీసులు నిద్రిస్తుండగా కొన్ని మీటర్ల దూరంలో ఒక యువకుడిని నరికి చంపారు. నిద్రపోతున్న అధికారుల వీడియో వైరల్ కావడంతో, ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
సోమవారం రాత్రి అహ్మదాబాద్‌లో గుర్తు తెలియని దుండగులు ఇద్దరు యువకులపై దాడి చేశారు, వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటనా స్థలంలో గుమిగూడిన స్థానికులు సమీపంలోనే పోలీసు PCR వాహనం ఆగి ఉండటం, అధికారులు మంచం మీద నిద్రపోవడం, హత్య గురించి తెలియకపోవడం గమనించారు. దీంతో స్థానికులు పోలీసు సిబ్బందిని నిద్రలేపుతూ, వీడియోను రికార్డ్ చేశారు. PCR విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉంటారు. ఎప్పటికప్పుడు గస్తీ నిర్వహిస్తూ ఉండాలి. అంతేకాకుండా అత్యవసర పరిస్థితులకు స్పందించాల్సి ఉంటుంది. కానీ ఈ అధికారులు ఎంచక్కా నిద్రపోయారు.
నరోరా నివాసి విజయ్ అలియాస్ విశాల్ శ్రీమాలి, ప్రియేష్ అనే ఇద్దరు యువకులను ఆరుగురు వ్యక్తుల బృందం వెంబడించి దాడి చేసింది. ఒక నిందితుడు జైసింగ్ సోలంకి విజయ్ ఛాతీపై కత్తితో పొడిచాడు. అతన్ని కాపాడే ప్రయత్నంలో ప్రియేష్ తీవ్రంగా గాయపడ్డాడు. విజయ్ అక్కడికక్కడే మరణించాడు. ప్రియేష్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కత్తితో పొడిచిన ఇద్దరు వ్యక్తులతో సహా ఇప్పటివరకు మొత్తం ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.