తన భార్యను పబ్లిక్ లో హత్య చేసేందుకు ప్రయత్నించిన కాలేజీ లెక్చరర్ ను చెన్నైలో అరెస్టు చేశారు. 58 ఏళ్ల వ్యక్తి తన భార్యపై బ్లేడ్‌తో దాడి చేయడానికి ముందు బిచ్చగాడిలా మారువేషంలో తిరుగుతూ వచ్చాడు. అయితే మహిళ అతన్ని గుర్తించడంతో పోలీసులు అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఎగ్మూర్‌లోని ఆంగ్లో-ఇండియన్ క్వార్టర్స్ రోడ్డులో నందనం ఆర్ట్స్ కళాశాల చరిత్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎం కుమారస్వామి తన భార్య జయవాణి (38)ని బస్సు దిగే సమయంలో బ్లేడుతో కోసి చంపేందుకు ప్రయత్నించాడు. మహిళ ముఖాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆమె అడ్డుకుని.. అక్కడి నుండి పారిపోయింది. కానీ బిచ్చగాడు ఆమెను వెంబడించాడు, ఈ ఘటనలో ఆమె శరీరంపై అనేక గాయాలు అయ్యాయి.
షాక్‌కు గురైన ప్రజలు దాడి చేసిన వ్యక్తిని పట్టుకోడానికి ప్రయత్నించగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ ఉద్యోగి జయవాణి యాచకుడి వేషంలో వచ్చిన వ్యక్తి తన భర్తే అని.. అతడే దాడికి పాల్పడ్డాడని పోలీసులకు చెప్పింది. కుమారస్వామిని శుక్రవారం ఎగ్మూర్ పోలీసులు పట్టుకున్నారు. తన భార్యపై అనుమానం ఉందని.. అందుకే చంపాలనుకున్నానని అతను ఒప్పుకున్నాడని ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (TNIE) ఒక నివేదికలో పేర్కొంది. తన భార్య సహోద్యోగితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానం, భార్యాభర్తల మధ్య వయసులో తేడా కారణంగా అతడి అనుమానాలు మరింత పెరిగాయని పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.