తొమ్మిదవ తరగతి చదువుతున్న బాలికను బాగా చదవడం లేదంటూ కుటుంబ సభ్యులు మందలించడంతో 17వ అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజీరా త్రినిటి హోమ్స్ లో చోటు చేసుకుంది.
మంజీర త్రినిటి 17వ అంతస్థు ఫ్లాట్ నంబర్ 1705లో నివాసం ఉంటున్న ఆకుల హరినారాయణ మూర్తి కూతురు ఆకుల లాస్య ప్రియ(13) అడ్డగుట్ట సొసైటిలోని నారాయణ హైస్కూల్లో 9వ తరగతి చదువుతుంది. గురువారం ఎప్పటిలాగే స్కూల్ కు వెళ్లింది. అదే సమయంలో స్కూల్లో పేరేంట్స్ మీటింగ్ ఉందంటూ స్కూల్ యాజమాన్యం లాస్య ప్రియ తల్లికి ఫోన్ చేసి పిలిపించారు. పేరేంట్స్ మీటింగ్ కు వచ్చిన లాస్య ప్రియ తల్లితో టీచర్ లాస్య ప్రియ చదువులో వెనకబడి పోతుందని చెప్పింది. దీంతో తల్లి స్కూల్లో జరిగిన విషయాన్ని లాస్య ప్రియ తండ్రి ఆకుల హరి నారాయణ మూర్తికి చెప్పింది. రాత్రి భోజనం అనంతరం కుటుంబ సభ్యులు లాస్యను బాగా చదువుకోవాలని మందలించారు. దీంతో కుంగిపోయిన లాస్య ఊహించని నిర్ణయం తీసుకుంది.