దారుణం.. లవర్‌ని వేధిస్తున్నాడని.. వ్యక్తిని కొట్టి చంపిన ప్రియుడు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ముక్కోణపు ప్రేమకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తిని కొట్టి చంపినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
By అంజి Published on 31 Dec 2024 7:31 AM ISTలవర్‌ని వేధిస్తున్నాడని.. వ్యక్తిని కొట్టి చంపిన ప్రియుడు
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ముక్కోణపు ప్రేమకు సంబంధించిన కేసులో ఓ వ్యక్తిని కొట్టి చంపినందుకు ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కొందరు వ్యక్తులు కర్రలతో అతి కిరాతకంగా కొట్టడంతో చేతన్ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ప్రకారం.. చేతన్ ఒక అమ్మాయితో సంబంధం కలిగి ఉన్నాడు. ఆమె పేరును పోలీసులు వెల్లడించలేదు.
వాళ్ల తల్లులు ఇద్దరూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నారు. కొన్ని రోజుల క్రితం, బాలిక తల్లి సుర్గుజా జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్‌కు బదిలీ చేయబడింది. ఆ తర్వాత బాలిక కూడా దుర్గ్‌ను విడిచిపెట్టవలసి వచ్చింది. సర్గుజాలో అమ్మాయి లుకేశ్ సాహు అనే యువకుడిని కలుసుకుంది. అతనితో సంబంధం పెట్టుకుంది. ఇంతలో, చేతన్ నిరంతరం అమ్మాయిని సంప్రదించడానికి ప్రయత్నించాడు. ఆమెకు కాల్ చేస్తూనే ఉన్నాడు. చేతన్ కాల్స్ కి రెస్పాండ్ అవ్వకపోవడంతో అతనితో విసిగిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 24న బాలిక తన తల్లితో కలిసి దుర్గ్‌కు వచ్చిందని.. ఆ విషయం తెలుసుకున్న చేతన్ తనను కలవాలని కోరాడు. అందుకు బాలిక నిరాకరించినా అతడు ఏమాత్రం చలించకుండా వేధించడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి చేతన్ గురించి లుకేష్‌కి చెప్పింది. అతను ఆమెను సంప్రదించడానికి, కలవడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాడు. ఇది విన్న లుకేశ్, తనను కలవడానికి చేతన్‌కు ఫోన్ చేయమని అమ్మాయికి చెప్పాడు. లుకేశ్ సూచనల మేరకు బాలిక దుర్గ్‌లోని సివిల్‌లైన్ ప్రాంతంలోని తన ఇంటి దగ్గర తనను కలవాలని చేతన్‌కు ఫోన్ చేసింది.
అమ్మాయిని కలవడానికి చేతన్ చేరుకున్నప్పుడు, అప్పటికే లుకేశ్ తన స్నేహితులతో అక్కడ ఉన్నాడు. కొద్ది సేపటికే ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం జరిగి శారీరకంగా తోపులాటకు దారితీసింది. లుకేష్, తన స్నేహితులతో కలిసి కర్రలతో చేతన్‌ను దారుణంగా కొట్టారు. దీంతో చేతన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారైన నిందితులను కొన్ని గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. బాలికను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, చేతన్ మృతదేహాన్ని అదే రాత్రి స్థానిక ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు నిందితుడిని విచారించి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.