మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.
By M.S.R Published on 8 May 2024 1:00 PM GMTసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్‌లో భాగమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. రష్యన్ సైన్యంలో పోరాడేందుకు భారతీయులను అక్కడికి పంపుతూ ఉన్నారు. భారతీయ పౌరుల అక్రమ రవాణాలో భాగమైన నలుగురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో నివాసం ఉంటున్న అరుణ్, యేసుదాస్ జూనియర్ అనే ఇద్దరు అనుమానితులను మంగళవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిజిల్ జోబి బెన్సమ్, ఆంథోనీ మైఖేల్ ఎలంగోవన్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
మార్చి 6, 2024న వెలుగులోకి వచ్చిన మానవ అక్రమ రవాణా నెట్‌వర్క్ గురించి జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయి. విదేశాలలో ఉపాధి అందిస్తామని, ఎక్కువ జీతం వస్తుందని ఆశ చూపి యువతను రష్యాకు పంపించే విధంగా ఈ నెట్ వర్క్ దేశవ్యాప్తంగా పనిచేసింది. యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి రష్యాలో అధిక-చెల్లింపుతో కూడిన ఉద్యోగాల కోసం భారతీయ పౌరులను ప్రలోభపెట్టారు. ప్రైవేట్ వీసా కన్సల్టెన్సీ సంస్థల ముసుగులో రష్యాకు భారతీయ పౌరులను అక్రమంగా తరలించడానికి సహకరించిన ఏజెంట్లపై సీబీఐ మానవ అక్రమ రవాణా కేసును నమోదు చేసింది. ఈ ఏజెంట్ల నెట్‌వర్క్ భారతదేశం అంతటా అనేక రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో కీలక వ్యక్తులలో నిజిల్ జోబీ బెన్సామ్, రష్యాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన అనువాదకుడిగా పనిచేసి, రష్యన్ సైన్యంలోకి భారతీయ జాతీయులను రిక్రూట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఆంథోనీ మైఖేల్ ఎలాంగోవన్, ఫైసల్ బాబా వీసాలను ప్రాసెస్ చేయడమే కాకుండా.. విమాన ప్రయాణాన్ని ఏర్పాటు చేశాడు. అరుణ్, యేసుదాస్ జూనియర్‌లు రష్యన్ ఆర్మీకి కేరళ, తమిళనాడు నుండి యువతను పంపించారు.