అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతుల దారుణ హత్య
హైదరాబాద్ అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
By Medi Samrat Published on 19 Oct 2024 3:16 PM ISTహైదరాబాద్ అంబర్‌పేట్‌లో వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంబర్పేట్ సాయిబాబా నగర్ కాలనీలో లింగారెడ్డి, ఊర్మిళాదేవి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. లింగారెడ్డి పంజాబ్ నేషనల్ బ్యాంకులో బ్యాంకులో ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు కాగా.. వారంతా అమెరికాలో స్థిరపడ్డారు. వృద్ధ దంపతులను తలపై బాది గొంతు కోసి కిరాతకంగా హత్య చేసినట్లు తెలుస్తుంది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మూడంతస్తుల భవనంలో కింద ఫ్లోర్‌లో వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. ఊర్మిళాదేవికి చేతికి ఉండాల్సిన నాలుగు గాజులు, మెడలో పుస్తెలతాడు లేదని పోలీసులు గుర్తించారు. ఊర్మిళా దేవి తల వెనుక భాగంలో బలమైన వస్తువుతో కొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతులు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించిన వ్యక్తులే ఈ హత్య చేసి ఉంటారా లేక దొంగతనానికి వచ్చిన దుండగులు దంపతులను హత్య చేసి ఉంటారా అని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలు ఢీ కంపోజ్ అయ్యాయి. మూడు రోజుల క్రితమే ఈ హత్యలు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసుకొని పరిసర ప్రాంతాల్లో ఉన్న సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.