మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు పెళ్లి సందడితో ఉన్న ఆ ఇళ్లు ఒక్కసారిగా మూగబోయింది. పెళ్లి పనులతో బిజీ బిజీగా ఉన్న పెళ్లి కుమార్తె తమ్ముడు.. తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. గుండ్రెడ్డిపల్లికి చెందిన మన్నె సుధాకర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, అతని భార్య అరుణ వారికున్న కొద్దిపాటి భూమిలో పొలం సాగు చేస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆదివారం కుమార్తె అనూష వివాహం ఉండగా.. కుటుంబ సభ్యులందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. కుమారుడు నవీన్ (18) కూడా తన స్నేహితులతో పెళ్లి పనులను చేస్తున్నాడు.
ఏమైందో ఏమో కానీ.. శుక్రవారం రాత్రి సమయంలో పని మీద బయటకు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రోజు నవీన్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు నవీన్ కోసం అన్ని చోట్ల వెతికారు. చివరకు వారి సొంత పొలంలో ఉన్న ఓ చెట్టుకు నవీన్ ఉరి వేసుకొని చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కొడుకు మృతితో ఆ కుటుంబం రోదనలు అక్కడున్న వారిని కలచి వేశాయి. పెళ్లికి వచ్చిన బంధువులు నవీన్ అంత్యక్రియల్లో పాల్గొనాల్సి రావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.