14 రోజుల కిందటే ప్రేమ వివాహం.. జీవితం ఇలా ముగిసింది..

14 రోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది వాళ్లకు. ఎంతో భవిష్యత్తును ఊహించుకున్నారు.

By -  Medi Samrat
Published on : 30 Oct 2025 9:02 AM IST

14 రోజుల కిందటే ప్రేమ వివాహం.. జీవితం ఇలా ముగిసింది..

14 రోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది వాళ్లకు. ఎంతో భవిష్యత్తును ఊహించుకున్నారు. కానీ వాళ్లు అనుకున్నదొకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. నవ వధువు కాళ్ల పారాణి ఆరక ముందే రోడ్డు ప్రమాదంలో మృత్యువు క‌బ‌ళించింది. యువకుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

చాంలేడు గ్రామానికి చెందిన చిలువేరు నవీన్‌కు, నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూషకు 14 రోజుల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అయితే పెద్దలు ఒప్పుకోడానికి కొంత సమయం పట్టినా, ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి. మూడు రోజుల క్రితం గుడిలో దండలు మార్చుకుని మళ్లీ పెళ్లి చేసుకున్నారు. నవీన్‌ తన భార్య అనూష(22)తో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుర్రంపోడు వైపు వస్తున్నారు. ఈ క్రమంలో గుర్రంపోడు సమీపంలోని వంతెన మీదకు రాగానే వీరి ద్విచక్ర వాహనం మరో ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నవీన్‌ కిందపడి తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. భార్య అనూష వంతెన గోడపై నుంచి ఎగిరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో పడింది. అనూషను దాదాపు 20 నిమిషాల తర్వాత పలువురు అక్కడికి చేరుకుని ఆమెను ఒడ్డుకు చేర్చారు. అనూషతో పాటు నవీన్‌ను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అనూష మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Next Story