Guntur : యువతి పొట్టలో ఇంజెక్షన్ ను గుచ్చేసి..
ప్రేమకు ఉన్న అర్థాన్ని మరిచిపోయారు. ప్రేమ అనే పేరుతో అమ్మాయిల మీద దాడులు
By Medi Samrat Published on 13 Sep 2023 2:53 PM GMTప్రేమకు ఉన్న అర్థాన్ని మరిచిపోయారు. ప్రేమ అనే పేరుతో అమ్మాయిల మీద దాడులు. నో చెప్పారని దాడులు చేయడం సర్వ సాధారణం అయ్యాయి. తాజాగా అలాంటి ఘటన గుంటూరులో చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థిని ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు.. తనను ప్రేమించడంలేదని యువతిపై కక్ష పెంచుకుని ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఇంజక్షన్ తో యువతిపై దాడి చేశాడు. యువతి పొట్టలో ఇంజక్షన్ గుచ్చాడు. ఆ ఇంజక్షన్ లో ఏముందోనని పోలీసులు విచారణ చేస్తున్నారు.
నాగ బాలాజీ అనే యువకుడితో యువతికి మొదట పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ కొంత కాలం ప్రేమించుకున్నాక విభేధాలతో విడిపోయారు. ఆ తర్వాత కూడా అతడు ఆ యువతిని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు తట్టుకోలేక యువతి దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరినీ స్టేషన్ కు పిలికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా నాగ బాలాజీ ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం యువతి కాలేజీకి వెళ్లే బస్సును వెంబడించాడు నాగ బాలాజీ. కాలేజీ దగ్గర యువతి దిగగానే ఒకసారి మాట్లాడాలని, తనతో రమ్మని బలవంతం చేశాడు. దీంతో యువతి అతనితో పాటు ఆటో ఎక్కింది. ఆ ఆటో గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే యువతి ఆటో దిగేందుకు ప్రయత్నించగా, నాగబాలాజీ తనతో తెచ్చిన ఇంజక్షన్ యువతి పొట్టలో పొడిచాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆమె వెంటనే అరండల్ పేట పోలీస్ స్టేషన్ లోకి పరిగెట్టింది. పోలీసులు నాగ బాలాజీ పట్టుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పరారయ్యాడు. యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. నాగ బాలాజీ యువతికి ఏ ఇంజక్షన్ చేశాడో అన్న భయం అందరిలో నెలకొంది.