యువ‌తిని పొలంలోకి ఈడ్చుకెళ్లి.. 15 ఏళ్ల బాలుడు అత్యాచార య‌త్నం.!

Boy drags woman to farm, attacks her for resisting rape. ఓ యువతిని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేయబోయాడు ఓ 15 ఏళ్ల బాలుడు. ఆమె ప్రతిఘటించడంతో రాయితో దాడి

By అంజి  Published on  27 Oct 2021 8:58 AM GMT
యువ‌తిని పొలంలోకి ఈడ్చుకెళ్లి.. 15 ఏళ్ల బాలుడు అత్యాచార య‌త్నం.!

ఓ యువతిని పొలంలోకి లాక్కెళ్లి అత్యాచార యత్నం చేయబోయాడు ఓ 15 ఏళ్ల బాలుడు. ఆమె ప్రతిఘటించడంతో రాయితో దాడి చేశాడు. ఈ ఘటన కేరళలోని కొండొట్టి పట్టణ శివారులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 23 ఏళ్ల యువతి సోమవారం రోజు రాత్రి తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్‌ వైపు తాను చదువుకుంటున్న కొండొట్టిలోని కంప్యూటర్‌ సెంటర్‌కు నడుచుకుంటూ వెళ్తొంది. ఈ క్రమంలోనే ఆ యువతిని 15 ఏళ్ల బాలుడు వెంబడించాడు. యువతిని వెనుక నుంచి పట్టుకుని సమీపంలోని పొలంలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో ఆ యువతి వెంటనే ప్రతిఘటించింది. బాలుడు ఆమె చేతులు కట్టేసి రాయితో దాడి చేశాడు. ఎలాగోలా బాలుడి నుంచి తప్పించుకున్న యువతి.. దగ్గర్లోని ఓ ఇంటికి వెళ్లి జరిగిన విషయం చెప్పింది. కొండోట్టి మునిసిపాలిటీకి చెందిన కొట్టుక్కర వార్డు కౌన్సిలర్‌ ఉమ్మర్‌ ఫరూక్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతి తెలిపిన వివరాల ఆధారంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. నిందితుడు 10వ తరగతి చదువుతున్న రాష్ట్ర స్థాయి జ్యూడో ఛాంపియన్‌గా పోలీసులు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. మొదట తాను యువతిపై అత్యాచారానికి యత్నించ లేదన్న నిందితుడు.. తర్వాత తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని జువైనల్‌ జస్టిస్‌ బోర్డు ముందు పోలీసులు హాజరుపర్చనున్నారు.

ఘటనలో యువతి ముఖం వాచిపోయింది, దాడి చేసిన వ్యక్తి ఆమె దుస్తులను చింపివేశాడు, మేం గాయపడిన ఆ యువతిని ప్రథమ చికిత్స అందించాము. ఆ తర్వాత కొండొట్టిలోని ఆస్పత్రికి ఆ తర్వాత మంజేరి మెడికల్‌ కాలేజీకి తరలించామని వార్డు కౌన్సిలర్‌ ఉమ్మర్‌ ఫరూక్‌ తెలిపారు. తాను పని చేసే కంప్యూటర్‌ సెంటర్‌ చేరుకోవడానికి మహిళ జంక్షన్‌ నుండి బస్సులో వెళ్తుందని, జంక్షన్‌ ఆమె ఇంటికి 1 కి.మీ దూరంలో ఉందని, జంక్షన్‌ చేరుకోవడానికి ఆమె వరి పొలం గుండా షార్ట్‌ కట్‌ ద్వారా వెళ్తుందని ఫరూక్‌ తెలిపారు.

తనపై దాడి చేసిన వ్యక్తిని మళ్లీ చూస్తే గుర్తించగలనని బాధిత యువతి తెలిపింది. ఇంతకుముందు కూడా తాను ఆ ప్రాంతంలో నిందితుడిని కొన్ని సార్లు చూశానని చెప్పింది.

మలప్పురం జిల్లా పోలీస్ చీఫ్ సుజిత్‌ దాస్‌ మాట్లాడుతూ.. అత్యాచారానికి యత్నించినప్పుడు నిందితుడిని ఆ యువతి గోర్లతో గిరినట్లు గుర్తులు ఉన్నాయని తెలిపారు. అయితే వెంటాడుతున్న కుక్క నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడిపోవడంతో తనకు గుర్తులు వచ్చాయని నిందితుడు తల్లిదండ్రులకు తెలిపాడు. వివరణాత్మకంగా విచారించగా.. నేరం తానే చేసినట్లు అంగీకరించాడు. యువతిపై అత్యాచారం చేసి హత్య చేసేందుకు బాలుడు ప్రయత్నించాడని నివేదిక అందజేస్తామని కొండొట్టి ఇన్‌స్పెక్టర్‌ ప్రమోద్‌ ఎంసీ తెలిపారు.

Next Story