తమిళనాడులోని చెంగల్‌పట్టులో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి విక్రయాలను బహిర్గతం చేసినందుకు తమ నాయకుడిని కొందరు కొట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. దారుణంగా గాయాలతో.. రక్తంతో తడిసిన బట్టలతో అతడు కనిపించాడు. దాడికి సంబంధించి పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై దాడిని ఖండించారు. బాధితుడిని, అతని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
బాధితుడిని తిరుకాజుకుండ్రంకు చెందిన ధనశేఖర్‌గా గుర్తించారు. అతను ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో అతను మానసికంగా అస్థిరంగా ఉన్న కాలేషా అనే వ్యక్తిని ప్రశ్నించాడు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అమ్ముతున్నారు అని కాలేషాను ధనశేఖర్ అడగడం కనిపించింది. కాలేషా బషీర్ నుంచి తెచ్చుకున్నానని, రూ.700కు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ధనశేఖర్ తన కారులో ప్రయాణిస్తుండగా, కనకోయిల్ కొట్టాయ్ సమీపంలో దుండగులు అతన్ని అడ్డుకుని, దారుణంగా కొట్టారు. రక్తంతో తడిసిన బట్టలతో ధనశేఖర్ అపస్మారక స్థితిలో పడి ఉండగా.. అతడిని పలువురు ప్రయాణికులు రక్షించి చెంగల్‌పట్టు ఆసుపత్రిలో చేర్పించారు. దాడికి పాల్పడిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.