కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ఇంట్లో దంపతులు, వారి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నిర్జీవంగా కనిపించినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరులోని ఆర్‌ఎంవీ 2వ స్టేజీ ప్రాంతంలోని అద్దె ఇంట్లో అనూప్ కుమార్ (38), అతని భార్య రాఖీ (35) తమ పిల్లలకు విషమిచ్చి చంపి ఆ తర్వాత వాళ్లు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. అనూప్ గత రెండేళ్లుగా నగరంలోని ఒక ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు.
సోమవారం ఉదయం పని మనిషి ఇంటి దగ్గరకు రాగా ఇంట్లో నుంచి సమాధానం రాలేదు. ఆందోళనకు గురైన పని మనిషి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు పోలీసులను సంప్రదించారు. ఈ నిర్ణయం వెనుక కారణం ఇంకా నిర్ధారించలేదు. అనూప్ కుమార్ బంధువులకు సమాచారం అందించామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్), శేఖర్ హెచ్ టెక్కన్నవర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.