నగరశివార్లలో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మృతదేహం
బెంగళూరు పోలీస్ విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇన్‌స్పెక్టర్ మృతదేహం నగర శివార్లలోని బిడది సమీపంలో కనుగొన్నారు.
By Medi Samrat Published on 6 Aug 2024 7:42 PM ISTబెంగళూరు పోలీస్ విభాగంలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఇన్‌స్పెక్టర్ మృతదేహం నగర శివార్లలోని బిడది సమీపంలో కనుగొన్నారు. చనిపోయిన వ్యక్తిని సీసీబీ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) పోలీసు ఇన్‌స్పెక్టర్ తిమ్మేగౌడగా గుర్తించారు. ఆయన వయసు 44 సంవత్సరాలు. పోలీసు అధికారులు మాట్లాడుతూ.. తిమ్మేగౌడ మృతదేహం బిడదిలోని నిర్జన ప్రదేశంలో కనుగొన్నామని తెలిపారు. అతని కుటుంబం సమీపంలోనే నివసిస్తూ ఉంటుందన్నారు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
తిమ్మేగౌడ జేబులో దొరికిన గుర్తింపు కార్డును బట్టి పోలీసులు అతడిని గుర్తించగలిగారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మా ప్రాథమిక విచారణలో అతను కొన్ని వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని తేలిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. తన అల్లుడు పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాడని తిమ్మేగౌడ మామ గోవిందప్ప ఆరోపించగా.. ఈ హత్యకు మద్దతు ఇచ్చే ఎలాంటి ఆధారాలు కూడా తమకు లభించలేదని పోలీసులు తెలిపారు.
నెల రోజుల క్రితం తిమ్మేగౌడ బెంగళూరులోని సీసీబీకి డిప్యూటేషన్ ఇచ్చారు. గతేడాది కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని అత్తిబెలెలో పటాకుల గోడౌన్‌లో మంటలు చెలరేగి 17 మంది మృతి చెందడంతో అతడిని సస్పెండ్ చేశారు. మంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (మెస్కామ్) పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా హసన్‌లో పనిచేస్తున్న సమయంలో తిమ్మేగౌడ ఒక మహిళను మోసం చేశాడనే ఆరోపణలపై కూడా కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. మహిళతో అక్రమ సంబంధం కొనసాగించిన తిమ్మేగౌడ.. ఆమెకు బిడ్డ పుట్టాక పెళ్లికి నిరాకరించాడు. దీనిపై 2007లో కేసు నమోదు కాగా, విచారణ జరిపిన పోలీసు శాఖ అతడికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఆరా తీస్తున్నారు.