టమోటాలు పండించబోయి నష్టపోయాడు.. ఉద్యోగంలో చేరి కంపెనీకి కన్నం వేయడం స్టార్ట్ చేశాడు..!
ఉద్యోగం చేస్తోందే అప్పులు తీర్చడానికి అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే..
By Medi Samrat Published on 18 Sept 2024 3:00 PM ISTఉద్యోగం చేస్తోందే అప్పులు తీర్చడానికి అని కొందరు చెబుతూ ఉంటారు. అయితే అతడు కంపెనీలో ఉద్యోగం చేస్తోందే తన అప్పులు తీర్చడానికని.. అది కూడా కంపెనీలోని ల్యాప్ టాప్ లను కొట్టేసి అమ్మేస్తూ అప్పులు తీర్చడానికని కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. దాదాపు 22 లక్షల విలువైన 50 కంపెనీ ల్యాప్‌టాప్‌లను దొంగిలించినందుకు, మల్టీమీడియా సంస్థలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన 29 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు నగర పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు టమోటా పండించాలని అనుకుని వ్యవసాయం చేసి నష్టపోయాడు, సైబర్ సెంటర్ వ్యాపారం కూడా చేశాడు. అలా మొత్తం 25 లక్షల వరకు నష్టపోయాడని తేలింది. అయితే అప్పులు తీర్చడానికి అతను ఉద్యోగం చేస్తున్న వైట్‌ఫీల్డ్‌లో ఉన్న కంపెనీ నుండి ల్యాప్‌టాప్‌లను దొంగిలించాడు. ప్రైవేట్ కంపెనీ ఇన్వెంటరీ ఇన్‌చార్జ్‌గా పని చేస్తున్న నిందితుడు మురుగేష్ తమిళనాడులోని హోసూర్‌కు చెందిన వ్యక్తి. బిసిఎ గ్రాడ్యుయేట్ అయిన మురుగేష్ ల్యాప్‌టాప్‌లు ఆఫీసులో కొట్టేసి అమ్మేశాడని పోలీసులు తెలిపారు.
కొంతకాలంగా ల్యాప్‌టాప్‌లను దొంగిలించినట్లు అంగీకరించిన మురుగేష్, వాటిని హోసూర్‌లోని గాడ్జెట్స్ రిపేర్ షాపుకు విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్ట్ 22 నుండి అతను అకస్మాత్తుగా ఉద్యోగం హాజరుకావడం మానేశాడు. అంతేకాకుండా ల్యాప్‌టాప్‌లు కూడా మాయమైన విషయాన్ని గమనించిన కంపెనీ అధికారులు సిసిటివి ఫుటేజీని తనిఖీ చేశారు. అందులో మురుగేష్ ప్రమేయం గురించి తెలుసుకున్నారు. కంపెనీ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోసూర్‌లో అతడిని పట్టుకుని బెంగళూరుకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగిలించిన ల్యాప్‌టాప్‌ల అంచనా విలువ 22 లక్షల రూపాయలు ఉంటుందని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు.