పిల్లల్ని చంపారు.. భర్త ప్రాణాలు తీసుకున్నాడు.. భార్య మాత్రం తండ్రితో మాట్లాడేందుకు వెళ్లి..
కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట మొదట తమ ఇద్దరు అమాయక పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించింది.
By - Medi Samrat |
కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ జంట మొదట తమ ఇద్దరు అమాయక పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సమయంలో భర్త చనిపోగా.. భార్య ఎలాగోలా ప్రాణాలతో బయటపడింది. దీంతో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూరులోని హోస్కోటే తాలూకాలోని గోనకనహళ్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలిచివేసింది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఆ దంపతులు.. చనిపోవడమే మంచిదని భావించి తమ బిడ్డలిద్దరి ఊపిరి తీసేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 ఏళ్ల శివుడు తన భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం శివుడికి యాక్సిడెంట్ అయింది, దాని వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపాడు. ఆర్థిక సంక్షోభంతో కుటుంబం సతమతమైంది. డబ్బు విషయంలో శివుడు, మంజుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నారు, కానీ పిల్లలు అనాథలవుతారేమోనన్న భయంతో విరమించుకున్నారు. చివరకు ఆ దంపతులు ముందుగా పిల్లలను చంపి ఆపై తమ ప్రాణాలను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఘటన జరిగిన మధ్యాహ్నం 2 గంటల సమయంలో శివుడు, మంజుల పిల్లలను చంపేందుకు ముందుగా మద్యం సేవించారు. సాయంత్రం 4 గంటల సమయంలో ఇద్దరూ కలిసి 11 ఏళ్ల కూతురు చంద్రకళను హత్య చేశారు. దంపతులు కూతురి తలను పట్టుకొని ఆమె శ్వాస ఆగిపోయేంత వరకు నీటిలో ఉంచారు. దీని తర్వాత 7 ఏళ్ల కుమారుడు ఉదయ్ సూర్యను కూడా అలాగే చంపారు.
పిల్లలను చంపిన తర్వాత మంజుల ఉరి వేసుకోవాలని నిర్ణయించుకోవడంతో శివుడు వాంతులు చేసుకున్నాడు. శివుడు దగ్గరి షాపులో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేసాడు. మంజుల దుకాణం నుంచి ఇంటికి వచ్చేసరికి శివుడు ఉరివేసుకుని చనిపోయాడు. ఆ తర్వాత చనిపోయే ముందు మంజుల తన తండ్రితో ఫోన్‌లో మాట్లాడాలనుకుంది. అయితే శివుడి ఫోన్ మాత్రమే ఇంట్లో ఉంది, అది లాక్ చేసి ఉంది. దీంతో మంజుల ఇరుగుపొరుగు ఇంటికి వెళ్లి తన తండ్రికి ఫోన్ చేయాలని కోరింది. ఇంతలో ఇరుగుపొరుగు వారికి నిజం చెప్పడంతో.. పోలీసులకు సమాచారం అంది.. మంజులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.