పార్కింగ్ స్థలాల నుండి వరుస వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన వ్యక్తులు కృష్ణ నగర్‌కు చెందిన నిమ్మతి శ్రీకాంత్ (32), ఉప్పల్‌కు చెందిన ఇ. నవీన్ (22) అని తెలిపారు. వీరు 10కి పైగా నేరాలకు పాల్పడ్డారు. ఈ ఇద్దరూ సినిమా షూటింగ్‌లలో కార్మికులుగా పనిచేస్తున్నారు. అరెస్టు అయిన వ్యక్తుల వద్ద నుండి పదమూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, జూబ్లీహిల్స్, గోపాలపురం, బోరబండ, మేడ్చల్, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క వాహనాన్ని దొంగిలించారు.
పోలీసుల దర్యాప్తులో మరో నిందితుడు షేక్ కలీంను కూడా గుర్తించారు. అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల నుండి దొంగిలించిన మోటార్ సైకిళ్లను కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్ గతంలో కూడా నేరాలు చేసాడని, ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో అనేక ఇతర కేసుల్లో రికార్డు అయి ఉన్నాడన్నారు పోలీసులు. ప్రస్తుతం పలు కేసులు విచారణ దశలో ఉన్నాయని బంజారా హిల్స్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఎస్ వెంకట్ రెడ్డి తెలిపారు.