ఢిల్లీలో సబ్బు నీళ్లతో నిండిన వాషింగ్ మెషీన్‌లో 15 నిమిషాలు ఓ ఏడాదిన్నర పిల్లాడు పడిపోయాడు. అంతసేపు ఉన్నా కూడా చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ఏడు రోజులు కోమాలో ఉండి వెంటిలేటర్‌పై, ఆపై 12 రోజులు వార్డులో చికిత్స అందించి చిన్నారిని కాపాడారు. ఇన్ని రోజులూ చిన్నారి అపస్మారక స్థితిలో ఉంది.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంది. ఆ తర్వాత ఆసుపత్రి వైద్యులు చిన్నారికి చికిత్సను అందించి కాపాడారు.
మూత తెరిచి ఉన్న టాప్-లోడింగ్ వాషింగ్ మెషీన్‌లో పిల్లాడు పడిపోయాడు. తల్లి ఆ సమయంలో వేరే గదిలో ఉంది. పిల్లాడి తల్లి మాట్లాడుతూ.. బాలుడు కుర్చీపైకి ఎక్కి సబ్బు నీళ్లతో నిండిన వాషింగ్ మెషీన్‌లో జారి పడిపోయాడని భావిస్తూ ఉన్నానని తెలిపింది. చిన్నారి కొనప్రాణాలతో ఉన్న సమయంలో ఆసుపత్రికి తీసుకుని వచ్చారని పీడియాట్రిక్స్ విభాగంలో కన్సల్టెంట్ డాక్టర్ హిమాన్షి జోషి తెలిపారు. సబ్బు నీటి కారణంగా, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతతో సహా వివిధ అవయవాల పనితీరు దెబ్బతిందని చెప్పారు. చిన్నారికి అవసరమైన యాంటీబయాటిక్స్, IV ఫ్లూయిడ్ సపోర్ట్ అందించామని, ఆ తర్వాత పిల్లాడు కోలుకోవడం ప్రారంభించాడని ఆమె తెలిపింది.