గుంటూరులోని జీజీహెచ్‌లో నాలుగు రోజుల పసికందు అదృశ్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సమయంలో మగ శిశువు అదృశ్యమయ్యాడు. శిశువును పక్కనపెట్టి అమ్మమ్మ, తాతయ్య నిద్రపోయారు. లేచి చూసేసరికి శిశువు కనిపించలేదు. గుర్తు తెలియని వ్యక్తులు శిశువును ఎత్తుకెళ్లారు. శిశువు అదృశ్యం కావడంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై శిశువు తల్లిదండ్రులు జీజీహెచ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ ఫుటేజీ ఆధారంగా తెల్లవారు జాము 1.30 గంటలకు శిశువు అపహరణకు గురైనట్లు పోలీసులు నిర్దారించారు. ఓ జంట శిశువును సంచిలో పెట్టి తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. కాగా కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా సెక్యూరిటీ లోపం వల్లనే శిశువు అపహరణకు గురైనట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలోని వార్డులకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారో తెలియడం లేదని శిశువు బంధువులు అంటున్నారు.