సిగ్న‌ల్‌ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

ఆగ్రాలోని సికంద్రా హైవేపై గురుద్వారా గురు కా తాల్ ముందు శనివారం ఘోర ప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  2 Dec 2023 4:20 PM IST
సిగ్న‌ల్‌ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మ‌ర‌ణం

ఆగ్రాలోని సికంద్రా హైవేపై గురుద్వారా గురు కా తాల్ ముందు శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ట్రాన్స్‌పోర్ట్ నగర్ నుంచి వేగంగా వస్తున్న లారీ సిగ్న‌ల్‌ వద్ద ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఆటోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ముందు నిలబడిన లారీకి.. వెనుక వస్తున్న లారీకి మధ్య ఆటో ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని చూసి అక్కడున్న జనం వణికిపోయారు.

సికింద్రా రైల్వే ఓవర్ బ్రిడ్జి.. గురుద్వారా నుంచి వస్తున్న వాహనాలు హైవే దాటుతుండగా.. ఇంతలో ట్రాన్స్‌పోర్ట్ నగర్ కూడలి నుంచి వేగంగా వస్తున్న రాజస్థాన్ నంబర్ గల ట్రక్ ఆటోను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో ముందు ఆగి ఉన్న లారీలో ఇరుక్కుపోయింది. ప్రయాణికులు కేకలు వేసే అవకాశం కూడా లేకపోయింది.

ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. హైవేపై ఉన్న బాటసారులు ప్రయాణికుల మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించినట్లు స్థానికులు చెప్పారు. అయితే మృతుల సంఖ్యను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. మరణించిన వారందరినీ గుర్తించేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Next Story