సంగారెడ్డి జిల్లాలో దారుణం.. చేతబడి చేశారని చెట్టుకు వేలాడదీసి.. ఆపై దాడి
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరులో శనివారం నాడు అమానుష ఘటన చోటుచేసుకుంది.
By అంజి Published on 18 Jun 2023 2:37 AM GMTసంగారెడ్డి జిల్లాలో దారుణం.. చేతబడి చేశారని చెట్టుకు వేలాడదీసి.. ఆపై దాడి
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాల పేరుతో దారుణాలు జరుగుతున్నాయి. ఎంతో ఉన్నతమైన మేధాశక్తి ఉన్న మానవులు.. మూఢ నమ్మకాలను నమ్మి, తమ తోటి వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చేతబడి చేశారని నమ్మి తోటివారిపై, పక్కింటి వారిపై దాడి చేస్తున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కొల్కూరులో శనివారం నాడు అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు టైంకు స్పందించడంతో దంపతులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సదాశివపేట పట్టణ సీఐ నవీన్ కుమార్ తెలిపారు.
ముత్తంగి యాదయ్య, అతని భార్య అమృతమ్మలను అదే గ్రామానికి చెందిన కొందరు.. అందరూ చూస్తుండగానే ఓ చెట్టుకు వేలాడేలా కట్టేసి, ఆపై దాడి చేశారు. గత కొన్ని రోజులుగా కొల్కూరులోని దాయాదులు కొందరు అనారోగ్యానికి గురయ్యారు. ఇదే విషయమై ఆ దాయాదులు స్థానికంగా క్షుద్రపూజలు చేసే వ్యక్తిని సంప్రదించారు. దీంతో అతడు మీ ఇంటి పక్కన ఉండే వ్యక్తే మీపై చేతబడి చేశాడని చెప్పాడు. ఈ క్రమంలోనే శనివారం నాడు యాదయ్య, అమృతమ్మలను పంచాయతీ సమీపానికి పిలిపించారు.
చేతబడి చేశారంటూ.. దంపతులను కొట్టి, చెట్టుకు వేలాడదీసి చిత్రహింసలు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని స్థానికులను చెదరగొట్టారు. యాదయ్య, అమృతమ్మలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు. మూఢ నమ్మకాల పేరుతో అమాయకులైన వారిపై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు.