హైదరాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.
By అంజి Published on 22 Aug 2023 7:30 AM ISTహైదరాబాద్‌లో దారుణం.. బాలుడి గొంతు కోసిన ఆటో డ్రైవర్
హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై ఓ వ్యక్తి ఒక్కసారిగా దాడి చేసి గొంతు కోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. కూన మహాలక్ష్మీనగర్‌లో ఆడుకుంటూ ఉన్న ఆది(9) ఆనే బాలుడిని ఆటో డ్రైవర్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొదట బాలుడికి మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్ తన అటోలో ఎక్కించుకున్నాడు. ఆపై పక్కవీధిలోకి తీసుకెళ్ళి ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడ్డారు. ఆటో డ్రైవర్ ఒక్కసారిగా బాలుడి మీద దాడి చేసి జేబులో ఉన్న కత్తి తీసుకుని బాలుడి గొంతు కోస్తుండగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ వారిని బెదిరించి బాలుడి గొంతు కోసి అక్కడనుండి పారిపోయాడు.
అనంతరం స్థానికులు తీవ్ర గాయాలైన బాలుని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. అయితే దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి. బాలుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడ ఉన్న సీసీకెమెరాల్లో రికార్డు అయినా దృశ్యాలను ఆధారంగా చేసుకుని, సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ని ట్రేస్ చేసి ఆటో డ్రైవర్‌ని పట్టుకున్నారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూన మహాలక్ష్మినగర్‌లో యాదగిరి(40) ఆటోడ్రైవర్, అతని భార్య ఇద్దరు పిల్లలు నివాసం ఉంటున్నాడు.
యాదగిరి తరచూ అందరితో గొడవ పడేవాడు. ఈ క్రమంలోనే భార్య అతడిని వదిలి 6 నెలల కిందట పుట్టింటికి వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చింది. నిన్న మధ్యాహ్నం యాదగిరి భార్య లక్ష్మి స్థానిక స్కూల్‌లో చదువుకుంటున్న కుతూరిని తీసుకురావడానికి స్కూల్‌కు వెళ్లింది. ఆ టైమ్‌లోనే వారి ఇంటి సమీపంలోనే ఉంటున్న ఆది(9) అనే బాలుడిని వెంట తీసుకుని యాదగిరి స్కూల్ దగ్గరకు వెళ్లాడు. లోపల ఉన్న తన భార్యను పిలవాలని బాలుడిని పురమాయించాడు. కోపంతో ఉన్న యాదగిరి దాడిచేస్తాడని లక్ష్మిని స్కూల్‌లోని ఆయాలు బయటకు పంపలేదు. కోపోద్రిక్తుడైన యాదగిరి ఆది గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిన్న సాయంత్రం 6 గంటలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.