అసోంలోని శివసాగర్ జిల్లాలో శనివారం ఒక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిని అతని విద్యార్థి కత్తితో పొడిచాడని పోలీసులు తెలిపారు. క్యాజువల్ డ్రెస్ వేసుకున్నందుకు మందలించినందుకు టీచర్‌పై 11వ తరగతి విద్యార్థి దాడికి పాల్పడ్డాడు. తరగతులు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. విద్యార్థి ఉపాధ్యాయుడు రాజేష్ బాబుపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. "మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో, ఒక విద్యార్థి పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచాడు. అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. మేము విద్యార్థిని అదుపులోకి తీసుకున్నాము" అని సీనియర్ పోలీసు అధికారి మొయిదుల్ ఇస్లాం తెలిపారు.
ఈ ఘటనను చూసిన ఓ విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడు స్కూల్‌కు యూనిఫాం కాకుండా సాధారణ దుస్తుల్లో వచ్చాడని, అతను తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు, ఉపాధ్యాయుడు అతనిని మందలించాడని, ఈ క్రమంలోనే టీచర్ విద్యార్థిపై అరిచాడని చెప్పాడు. "ప్రతిస్పందనతో కోపంగా అనిపించి, అతను కత్తి తీసి ఉపాధ్యాయుని తలపై పొడిచాడు. అతని వద్ద పదునైన ఆయుధం ఉందని మాకు తెలియదు. మా ఉపాధ్యాయుడు నేలపై పడిపోవడంతో గాయపడి తీవ్ర రక్తస్రావం జరిగింది" అని ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, సీసీటీవీ విజువల్స్‌ను పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.