ఫేక్ సర్టిఫికెట్లతో అమెరికాకు వెళ్లాలనుకుంటే మాత్రం..

ఫేక్ సర్టిఫికేట్లు.. ఈ దందా బాగా పాపులర్ అయింది. ఇష్టమొచ్చినట్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు.

By Medi Samrat  Published on  22 Nov 2023 11:48 AM GMT
ఫేక్ సర్టిఫికెట్లతో అమెరికాకు వెళ్లాలనుకుంటే మాత్రం..

ఫేక్ సర్టిఫికేట్లు.. ఈ దందా బాగా పాపులర్ అయింది. ఇష్టమొచ్చినట్లు ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారు.. ఇంకొందరు విదేశాలకు కూడా చెక్కేస్తూ ఉన్నారు. ఎంతో మంది ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. అయితే ఎల్లకాలం అనుకున్నట్లుగా ఆటలు సాగవు కదా.. తాజాగా అలాంటి ఓ నకిలీ సర్టిఫికెట్ల దందా బాగోతం బయటపడింది. చెన్నై పోలీసులు ఏపీకి చెందిన వ్యక్తులను అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు.

పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీని హరిబాబు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కోసం ఈ కన్సల్టెన్సీని నడుపుతున్నారు. విద్యార్హతలు లేకుండానే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు డబ్బులు తీసుకుని పంపించేందుకు ప్రయత్నించాడు హరిబాబు. భారీగా డబ్బులు తీసుకుని అవసరమైన ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు ఇస్తూ వస్తున్నాడు. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన హేమంత్ అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉండగా.. అతడు హరిబాబుకు చెందిన ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీని సంప్రదించాడు. విదేశాలకు వెళ్లేందుకు తగిన నకిలీ సర్టిఫికేట్లను సమకూర్చాడు హరిబాబు. అవి తీసుకుని ఇటీవల అమెరికా వీసా కోసం దరఖాస్తు చూసుకున్నాడు హేమంత్. ఈ నెల 16న తమిళనాడు రాజధాని చెన్నైలో యూఎస్ కాన్సులేట్ లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఫార్మాలిటీలో భాగంగా అతడి వద్దవున్న సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులు అవి నకిలీవని తేల్చారు. యూఎస్ కాన్సులేట్ అధికారుల ఫిర్యాదు మేరకు చెన్నై సెంట్రల్ క్రైమ్ పోలీసులు హేమంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా ఎకో ఓవర్సీస్ కన్సల్టెన్సీ దందా గురించి బయటపెట్టాడు. నరసరావుపేటకు చేరుకున్న చెన్నై పోలీసులు హరిబాబును అరెస్ట్ చేసారు.

Next Story