హైదరాబాద్ దోమలగూడ లోని గ్యాస్ లీక్ ప్రమాదం ఘటనలో మరొకరు మృతి చెందారు. ఈనెల 11వ తేదీన దోమలగూడ రోజ్ కాలనీలో జరిగిన గ్యాస్ పైప్ లైన్ లీక్ ప్రమాదంలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందర్ని పోలీసులు గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఏడుగురులో పద్మ(55), ధనలక్ష్మి(30), ధనలక్ష్మి కొడుకు అభినవ్ (7), కూతురు శరణ్య(11) మృతిచెందగా.. నిన్న గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పద్మ చెల్లెలు నాగమణి (38) మృతి చెందింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన ఆనంద్ (41), ధనలక్ష్మి చిన్న కుమారుడు విహాన్ (4) గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విహాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విహాన్ కొద్దిసేపటి క్రితమే మృతి చెందాడు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.