Chittoor: మైనర్ విద్యార్థినిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్.. అసలేమైందంటే?
మైనర్ బాలికను పెళ్లి చేసుకోని మోసగించిన ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 2 April 2023 3:30 PM ISTChittoor: మైనర్ విద్యార్థినిని పెళ్లి చేసుకున్న టీచర్ అరెస్ట్.. అసలేమైందంటే?
మైనర్ బాలికను పెళ్లి చేసుకోని మోసగించిన ఉపాధ్యాయుడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా గంగవరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయుడు చలపతి (33).. 17 ఏళ్ల విద్యార్థినిని వివాహం చేసుకున్నాడు. బాలిక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం (12వ తరగతి) చదువుతుండగా, అప్పటికే వివాహితుడైన ఉపాధ్యాయుడు.. ఆమెను మార్చి 29న పరీక్షలు ముగిసిన వెంటనే తిరుపతికి తీసుకెళ్లి అక్కడ వివాహం చేసుకున్నారు. ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
బాలికకు చివరి పరీక్ష జరిగిన వెంటనే నిందితుడు.. ఆమెను మాయమాటలతో మోసగిస్తూ తిరుపతికి తీసుకెళ్లారని ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. మైనర్‌కు తాను నిజాయితీపరుడని, తనను నమ్మాలని, సరిగ్గా చూసుకుంటానని చెప్పాడు. వారిద్దరూ తిరుపతిలోని ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత చలపతి ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించిన బాలిక.. జరిగిన మొత్తం విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో బాలిక తన తల్లిదండ్రులతో కలిసి గురువారం రాత్రి గంగవరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.
బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు చలపతిపై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి మార్చి 31న అరెస్టు చేశారు. బొమ్మనపల్లె గ్రామానికి చెందిన చలపతికి అదే గ్రామానికి చెందిన బాలికతో మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. అతని భార్య త్వరలోనే రెండవ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇది పట్టించుకోకుండా 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల యువతితో సంబంధం పెట్టుకున్నాడు. నిందితుడిని పోస్కో చట్టం కింద అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసు అధికారి తెలిపారు.