బీజేపీ మైనారిటీ మోర్చా నాయకురాలి హత్య.. భర్త అరెస్ట్
మహారాష్ట్రలోని జబల్‌పూర్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా నేత సనాఖాన్ హత్యకు గురయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2023 9:15 PM ISTమహారాష్ట్రలోని జబల్‌పూర్‌లో బీజేపీ మైనారిటీ మోర్చా నేత సనాఖాన్ హత్యకు గురయ్యారు.ఈ కేసులో నిందితుడైన భర్త అమిత్ అలియాస్ పప్పును పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. సన కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతుకుతున్నారు. అయితే సనాను హత్య చేసి మృతదేహాన్ని హిరాన్ నదిలో పడేసినట్లు నిందితుడు అంగీకరించాడు.
ఈ కేసులో పోలీసులు నిందితుడిని నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్ళారు. అయితే నిందితుడు బీజేపీ నాయకురాలిని ఏ కారణంతో హత్య చేశారనేది నిర్ధారణ కాలేదు. ఈ కేసులో సనా మృతదేహాన్ని పోలీసులు ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. పోలీసులు సనా మృతదేహం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
నాగ్‌పూర్‌లోని మనక్‌పూర్ ప్రాంతానికి చెందిన సనాఖాన్.. బిల్హరిలో నివాసముంటున్న ధాబా నిర్వాహకుడు అమిత్ (పప్పు)ని ఆరు నెలల క్రితం పెళ్లాడింది. సనా ఖాన్ తన తల్లికి చెప్పి ఆగస్టు 1న జబల్‌పూర్‌కు బయలుదేరింది. ఆగస్ట్ 2న సనా బంధువు ఇమ్రాన్‌కు ఫోన్ చేసి జబల్‌పూర్‌కు చేరుకునే విషయాన్ని తెలియజేసింది. అదే రోజు సాయంత్రం ఇమ్రాన్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. భర్త కొట్టిన దెబ్బల గురించి సనా చెప్పింది. ఈ విషయాన్ని ఇమ్రాన్.. సనా తల్లికి చెప్పాడు.
ఆరు నెలల క్రితం ధాబా ఆపరేటర్ అమిత్ అలియాస్ పప్పు సాహును సనా వివాహం చేసుకున్నట్లు సీఎస్పీ తుషార్ సింగ్ తెలిపారు. తన తల్లికి సమాచారం ఇవ్వడంతో ఆమె ఆగస్టు 1న నాగ్‌పూర్ నుంచి జబల్‌పూర్‌కు బయలుదేరింది. ఆగస్ట్ 2న ఆమె జబల్‌పూర్‌కు చేరుకోవడం గురించి తన బంధువు ఇమ్రాన్‌కు ఫోన్‌లో తెలియజేసింది. ఆ తర్వాత పప్పు సాహు.. సనాను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత సన కనిపించకుండా పోయింది. ఆమె మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి.
ఈ సంఘటనపై సనా బంధువులు నాగ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నాగ్‌పూర్ నుండి పోలీసు బృందం విచారణ కోసం జబల్‌పూర్‌కు చేరుకున్నప్పటికీ సనా జాడ తెలియలేదని తుషార్ సింగ్ చెప్పారు. సనాను పప్పు సాహు హత్య చేశారని బంధువులు ఆరోపించారు. సనా నాగ్‌పూర్ నుంచి జబల్‌పూర్‌కు వెళ్లే సమయంలో లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు ధరించినట్లు ఆమె బంధువులు చెబుతున్నారు. పప్పును విచారించిన అనంతరం సనా మృతదేహాన్ని వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎస్పీ సింగ్ తెలిపారు.