ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి మధుర యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై 68 మైలురాయి సమీపంలో బోల్తా పడ్డ ట్యాంకర్‌ను ఇన్నోవా వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి చెందారు. ఓ ట్యాంక్ నోయిడా నుంచి ఆగ్రా వైపు వెళ్తుండగా, టైర్ పేలి అదుపు తప్పి మరో మార్గంలో బోల్తా పడింది. అయితే ఈ క్రమంలో ఆగ్రా నుంచి నోయిడా వెళ్తున్న ఇన్నోవా అతివేగంగా వచ్చి దానిని ఢీకొట్టింది. ఇందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు హర్యానాలోని జింద్‌కు చెందిన మనోజ్ (46), అతని భార్య బబితా (41), కుమారులు అభయ్ (18), హేమంత్ (16), హిమాంగి (15), మను (11), డ్రైవర్ రాకేష్ (39)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇన్నోవా నుజ్జునుజ్జు అయ్యింది.
మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోవడంతో బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కట్టర్ సహాయంతో మృతదేహాలను బయటకు తీసిశారు. ఘటన స్థలాన్నిఎస్పీ దేహాత్ శ్రీచంద్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.