తన ప్రియురాలు శ్రద్ధా వాకర్‌ను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికిన అఫ్తాబ్ పూనావాలాకు ఢిల్లీ కోర్టు ఈ మధ్యాహ్నం 13 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. హత్య కేసులో విచారణ నిమిత్తం ఢిల్లీ పోలీసులు అతడిని కస్టడీకి పంపారు. దీంతో పోలీసులు అఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. అంబేద్కర్ ఆసుపత్రి నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆఫ్తాబ్‌ను కోర్టు ముందు హాజరుపరిచారు. శనివారం ఉదయం పోలీసులు అతన్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అఫ్తాబ్ ను ప్రజలకు, మీడియాకు దూరంగా ఉంచేందుకు పోలీసులు అదనపు చర్యలు చేపట్టారు. ఈ మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఆఫ్తాబ్‌ను ఆసుపత్రిలోని ఒక ప్రత్యేక గదిలో ఉంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు ఢిల్లీ పోలీసులు. దీంతో కోర్టు అతడికి డిసెంబర్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఇదిలావుంటే.. శ్రద్ధా, ఆఫ్తాబ్ డేటింగ్ యాప్‌లో కలుసుకున్నారు. 2019 నుండి సహజీవనం చేస్తున్నారు. ముంబై నుండి ఢిల్లీకి మకాం మార్చిన ఈ జంటకు వివాహం విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆఫ్తాబ్ శ్రద్ధను గొంతు కోసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఈ విషయమై శ్రద్ధా స్నేహితుడు లక్ష్మణ్ నాడార్ మాట్లాడుతూ.. గతంలో కూడా శ్రద్ధా, ఆఫ్తాబ్ జంట మధ్య చాలా గొడవలు, వాదనలు జరిగేవి. "ఒకసారి శ్రద్ధా నన్ను వాట్సాప్‌లో సంప్రదించి.. తన నివాసం నుండి రక్షించమని కోరింది. ఆ రాత్రి అతనితో కలిసి ఉంటే చంపేస్తాడని చెప్పిందని చెప్పారు. ఈ మర్డర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.