రూ.50 ఆదా చేసేందుకు ప్రయత్నించి రూ.లక్ష పోగొట్టుకున్న‌ మహిళ

A woman who tried to save Rs.50 and lost Rs.1 lakh. ఓ కంపెనీకి చెందిన డెలివరీ బాయ్ సరుకులు డెలివరీ చేసేందుకు ఓ మహిళ నుంచి డెలివరీ చార్జీగా రూ.50 తీసుకున్నాడు.

By Medi Samrat  Published on  3 April 2023 9:17 PM IST
రూ.50 ఆదా చేసేందుకు ప్రయత్నించి రూ.లక్ష పోగొట్టుకున్న‌ మహిళ

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఓ కంపెనీకి చెందిన డెలివరీ బాయ్ సరుకులు డెలివరీ చేసేందుకు ఓ మహిళ నుంచి డెలివరీ చార్జీగా రూ.50 తీసుకున్నాడు. ఆ మహిళ అతనికి డబ్బులు ఇవ్వ‌గా అత‌డు వెళ్లిపోయాడు. మహిళ ఆ కంపెనీ వెబ్‌సైట్‌ను పరిశీలించగా అందులో ఫ్రీ డెలివరీ అని రాసి ఉంది. ఆ మహిళ గూగుల్ సహాయంతో ఆ కంపెనీ నంబర్ క‌నుక్కుని కాల్ చేసింది. సదరు వ్యక్తి కంపెనీ ప్రతినిధిగా నటిస్తూ రూ.50 తిరిగి ఇస్తానన్న సాకుతో బాధితురాలి ఖాతా నుంచి రూ.లక్ష మాయం చేశాడు. బాధితురాలు సుష్మ ఫిర్యాదు మేరకు ఈశాన్య జిల్లా పోలీస్‌స్టేషన్‌లోని సైబర్ సెల్ మోసంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. బాధితురాలు సుష్మ తన కుటుంబంతో కలిసి ఖజూరి ఖాస్‌లో నివసిస్తోంది. ఆమె ఒక వెబ్‌సైట్ లో మూడు వస్తువులను ఆర్డర్ చేసింది. డెలివరీ ఛార్జీకి విడిగా రూ.50 చెల్లించాలని సరుకులు తీసుకొచ్చిన డెలివరీ బాయ్ చెప్పినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయంలో బాధితురాలు అతనికి డబ్బులు ఇవ్వడంతో డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు.

కొంతకాలం తర్వాత.. డెలివరీ బాయ్ కు 50 రూపాయలు అన‌వ‌సరంగా ఇచ్చాన‌ని బాధితురాలు భావించింది. ఆమె కంపెనీకి సంబంధించిన నెంబర్ల కోసం గూగుల్ లో వెత‌క‌డం ప్రారంబించింది. ఈ క్ర‌మంలోనే ఓ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడగా.. ఒక యువకుడు కాల్ లిప్ట్ చేసి.. తాను కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. డెలివరీ బాయ్ తన నుంచి తప్పుగా డబ్బులు తీసుకున్నాడని బాధితురాలు చెప్పింది. దీంతో ఆ యువ‌కుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాన‌ని చెప్పాడు. ముందుగా బాధితురాలి ఫోన్‌లో ఎనీ డెస్క్ అనే యాప్ డౌన్‌లోడ్ చేయిస్తాడు. బాధితురాలిని మాటల్లో పెట్టి ఆ యాప్ ఐడీని కనుక్కున్నాడు. మరికొద్ది సేపట్లో రూ.50 మీ ఖాతాలో జ‌మ అవుతాయ‌ని దుండగుడు బాధితురాలికి చెప్పాడు. చాలా సేపటికి కూడా డబ్బులు రాకపోవడంతో బాధితురాలు మొబైల్ చూసింది. తన ఖాతా నుంచి లక్ష రూపాయలు డ్రా అయినట్లు మొబైల్‌లో మెసేజ్ రావడంతో షాక్‌కు గురయ్యింది. బాధితురాలు తాను మాట్లాడిన నంబర్‌కు ఫోన్ చేయగా.. ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో.. బాధితురాలు విషయాన్ని పోలీసులకు తెలిపింది.


Next Story