గ‌చ్చిబౌలిలో దారుణం.. నిండు గ‌ర్భిణి దారుణ హ‌త్య‌

A pregnant woman is brutally murdered in Hyderabad.గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sept 2022 10:16 AM IST
గ‌చ్చిబౌలిలో దారుణం.. నిండు గ‌ర్భిణి దారుణ హ‌త్య‌

గ‌చ్చిబౌలి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. నిండు గ‌ర్భిణిని వేట‌కొడ‌వ‌లితో ఓ వ్యక్తి న‌రికి చంపాడు. ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన వెంక‌ట‌రామ‌కృష్ణ త‌న భార్య స్ర‌వంతి(32)తో క‌లిసి కొండాపూర్‌లోని జేవీజీహిల్స్ డీఆర్ ట‌వ‌ర్స్ లో ఉంటున్నాడు. వీరికి ఓ కుమారై కాగా..స్ర‌వంతి ప్ర‌స్తుతం 8 నెల‌ల గ‌ర్భ‌వ‌తి. వెంక‌ట‌రామ‌కృష్ణ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తున్నాడు. అత‌డి చిన్న‌మ్మ కుమార్తె ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌ని చేస్తోండ‌గా.. ఆమెకు రెండేళ్ల కిత్రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పేరుపాలెం గ్రామానికి చెందిన కావూరి శ్రీరామ కృష్ణ‌తో పెళ్లైంది.

ల‌క్ష్మీ ప్ర‌స‌న్నను ఆమె భ‌ర్త అనుమానం, అద‌న‌పు క‌ట్నం కోసం వేదిస్తుండ‌డంతో పెళ్లికి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రించిన వెంక‌ట రామ‌కృష్ణ బంధువుల‌తో క‌లిసి అత‌డి స్వ‌గ్రామానికి వెళ్లి పంచాయ‌తీ చేశాడు. చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న హైద‌రాబాద్‌లోని పుట్టింటికి వ‌చ్చి..ఇక్క‌డే ప‌ని చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ల‌క్ష్మీ ప్ర‌స‌న్న త‌న భ‌ర్త వేదింపుల‌కు పాల్ప‌డుతున్నాడంటూ చందాన‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు శ్రీరామ కృష్ణ‌ను స్టేష‌న్‌కు పిలిపించి నోటీసులు ఇచ్చారు.

దీని అంత‌టి వెనుక బామ్మ‌ర్ది వెంక‌ట రామ‌కృష్ణ ఉన్నాడ‌ని అత‌డిని హ‌త్య చేయాల‌ని శ్రీరామ కృష్ణ నిర్ణ‌యించుకున్నాడు. ఎర్ర‌గ‌డ్డ‌లో వేట కొడ‌వ‌లి కొనుగోలు చేసి ఈ నెల 6న కొండ‌పూర్‌లోని వెంక‌ట‌రామ‌కృష్ణ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ స‌మ‌యంలో కుమార్తెను స్కూల్ నుంచి తీసుకువ‌చ్చేందుకు వెంక‌ట రామ‌కృష్ణ వెళ్ల‌డంతో ఇంట్లో స్ర‌వంతి ఒక్క‌తే ఉంది.

శ్రీరామ కృష్ణ చేతిలో వేట‌కొడ‌వ‌లి ఉండ‌డాన్ని చూసిన స్ర‌వంతి భ‌యంతో కేక‌లు వేస్తూ బ‌య‌ట‌కు వెళ్లేందుకు య‌త్నించింది. నిండు గ‌ర్భిణీ అని చూడ‌కుండా శ్రీరామ‌కృష్ణ ఆమె త‌ల వెనుక‌భాగం, భుజం మీద దాడి చేసి పారిపోయాడు. ఆమె కేక‌లు విన్న ఇరుగుపొరుగు వారు వ‌చ్చి ఆమెను ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా..చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి ప్రాణాలు కోల్పోయింది. కేసు న‌మోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story