చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కోడి కత్తి పొడుచుకుపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటన పెద్దమండ్యం మండలం నిప్పువనంలో జరిగింది. స్థానికంగా ఉన్న కలిచెర్ల పోలేరమ్మ ఆలయం సమీపంలో కోడి పందాలు జరుగుతున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడులకు వెళ్లారు. పోలీసులను చూసిన కోడి పందె రాయుళ్లు పరుగుపెట్టారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి.. కోళ్లను పట్టుకుని వెళ్లాలనుకున్నాడు. కోడి పట్టుకుని పరిగెత్తిన క్రమంలో కోడి కాలికి ఉన్న కత్తి గుచ్చుకుంది. దీంతో అతడికి రక్తం ధారకట్టింది. కత్తిగాటుకు గాయపడ్డ వ్యక్తిని ముదివేడుకు చెందిన గంగులయ్యగా గుర్తించారు.
అతడిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ గంగులయ్య మృతి చెందాడు. ఈ కోడిపందాలకు సంబంధించి 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పోలీసుల భయంతో పరుగులు పెట్టిన గంగులయ్య కత్తి పొడుచుకుని చనిపోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. పందాల కోసం కోళ్లకు కట్టే కత్తులు ఎంతో షార్ప్‌గా ఉంటాయి. వాటిని సాధారణంగా నిపుణులతో మాత్రమే కోళ్లకు కట్టిస్తారు. కోడి కత్తి తగిలితే అంతే.. తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఇక కోడిపందాలు జరిగే బరుల్లోకి ఎవరినీ రానివ్వరు.