తన భార్యను తన వద్దకు పంపించడం లేదని.. వదిన కొడుకును కడతేర్చిన మరిది

A man murdered a child in hyderabad. హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యను తన వద్దకు పంపించడం లేదని వదిన కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ మరిది.

By అంజి  Published on  21 Nov 2021 3:16 AM GMT
తన భార్యను తన వద్దకు పంపించడం లేదని.. వదిన కొడుకును కడతేర్చిన మరిది

హైదరాబాద్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్యను తన వద్దకు పంపించడం లేదని వదిన కొడుకును దారుణంగా హత్య చేశాడు ఓ మరిది. ఈ ఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో మహేశ్వరి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పని చేసేది. ఆమె సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. కాగా ఆమెకు కుటుంబ సభ్యులు రాజు అనే వ్యక్తితో పెళ్లి చేశారు. దీంతో వారు స్వగ్రామానికి వెళ్లిపోయారు. మహేశ్వరికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా.. భర్త రాజు 6 ఏళ్ల క్రితం చనిపోయాడు.

పిల్లల పోషణ భారం కావడంతో మహేశ్వరి 5 ఏళ్ల క్రితం వినోద్‌ కుమార్‌ రెడ్డి రెండో వివాహం చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడలో గల రాజీవ్‌గృహకల్పలో ఉంటోంది. ఈ క్రమంలోనే మహేశ్వరి తన చెల్లలు లక్ష్మీ, ఆమె భర్త వీరేశ్‌లను నగరానికి తీసుకొచ్చింది. మహేశ్వరికి రెండో భర్తతో లక్కీ (4) పుట్టాడు. ఆ తర్వాత రెండో భర్త మహేశ్వరిని వదిలిపెట్టాడు. దీంతో మహేశ్వరి తన చెల్లెలు ఇంట్లో ఉంటోంది. ఇంట్లో ఉంటునే అక్క మాటలు వింటూ తన భార్య లక్ష్మీ తనన పట్టించుకోవడం లేదని వీరేశ్‌ కోపంగా ఉన్నాడు.

వదినపై ఆగ్రహంతో ఆమె కొడుకు లక్కీని బయటకు తీసుకెళ్లాడు. వీరేశ్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో భయాందోళనకు గురైన అక్కా చెల్లెళ్లు వెంటనే మైలార్‌దేవుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరేశ్‌ను కాటేదాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. దీంతో అసలు దారుణం వెలుగు చూసింది. నాలుగేళ్ల బాలుడు లక్కీని జల్‌పల్లి పారిశ్రామిక వాడలోని ఖాళీ గోదాములోకి తీసుకెళ్లి ఉరివేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన చిన్నారి అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. తలపై గట్టిగా కొట్టి హతమార్చాడు వీరేశ్‌. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

Next Story
Share it