విశాఖ ప్రేమోన్మాద ఘటన.. చికిత్స పొందుతూ యువతి మృతి..!

A female software engineer has died while being treated at a hospital. ఈ నెల 13న విశాఖలో ఓ యువకుడు ప్రేమను నిరాకరించందన్న కోపంతో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై పెట్రోల్‌ దాడి చేసి అనంతరం తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే.

By అంజి
Published on : 20 Nov 2021 8:47 AM IST

విశాఖ ప్రేమోన్మాద ఘటన.. చికిత్స పొందుతూ యువతి మృతి..!

ఈ నెల 13న విశాఖలో ఓ యువకుడు ప్రేమను నిరాకరించందన్న కోపంతో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై పెట్రోల్‌ దాడి చేసి అనంతరం తనపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్న విషయం తెలిసిందే. పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి శుక్రవారం నాడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. కాగా ఈ నెల 16వ తేదీన చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. విశాఖపట్నంకు చెందిన ఓ యువతి (20), తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్‌ రెడ్డి (21) పంజాబ్‌లో గత సంవత్సరం బీటెక్‌ పూర్తి చేశారు.

హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో హర్షవర్ధన్‌ రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. యువతి కూడా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీరింగ్‌ ఉద్యోగాన్ని ఇంటి వద్దే నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే సదరు యువకుడు విశాఖ వెళ్లాడు. అక్కడే ఓ హోటల్‌ రూమ్‌ తీసుకున్నాడు. తాను విశాఖకు వచ్చిన సమాచారాన్ని యువతికి అందించాడు. దీంతో యువతి కూడా శనివారం హోటల్‌కు వచ్చింది. ఈ క్రమంలోనే హర్షవర్ధన్‌ రెడ్డి తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతిని కోరాడు. ఈ ప్రతిపాదనను ఆమె తిరస్కరించింది.

దీంతో ఆవేశానికి గురైన యువకుడు యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఆ తర్వాత తాను కూడా పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇద్దరికి మంటలు అంటుకోవడంతో హోటల్‌ నుండి పొగతో కూడిన మంటలు బయటకు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న హోటల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా కాలిన గాయాలతో శరీరంలోని అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ఇద్దరు మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story