చిన్నారి కాలిగజ్జెలకు కరెంట్‌ తీగలు చుట్టి.. షాక్‌ ఇచ్చి చంపిన కసాయి తండ్రి.!

A father murdered his daughter in Venkatravupeta. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురికి కరెంట్‌ షాక్‌ ఇచ్చి

By అంజి  Published on  4 Dec 2021 8:44 AM IST
చిన్నారి కాలిగజ్జెలకు కరెంట్‌ తీగలు చుట్టి.. షాక్‌ ఇచ్చి చంపిన కసాయి తండ్రి.!

సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతురికి కరెంట్‌ షాక్‌ ఇచ్చి చంపాడు తండ్రి. ఆపై తండ్రి కూడా పురుగుల మందు తాగు ఆత్మహత్యకు యత్నించాడు. శుక్రవారం నాడు జరిగిన ఈ ఘటన ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వెంకట్రావుపేటకు చెందిన ఎం.రాజేశేఖర్‌కు.. దౌల్తాబాద్‌కు చెందిన సునీతతో రెండు సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది. ఆ తర్వాత సంసారం సజావుగా సాగింది.

కొన్ని రోజులకు వారికి పాప పుట్టింది. ఇక అప్పటి నుండి భార్య సునీతపై భర్త రాజశేఖర్‌, అత్తామామలు నర్సవ్వ, యాదయ్య, వదినె సౌందర్యలు అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చారు. పలుమార్లు గొడవలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే భర్త రాజశేఖర్‌, భార్య సునీతతో కలిసి అద్దె ఇంటికి మారాడు. మళ్లీ కొద్దిరోజులకే భర్త మనసు మార్చుకున్నాడు. తల్లిదండ్రుల దగ్గరే ఉందామంటూ భార్య సునీతతో గొడవ పడుతున్నాడు. ఇదే విషయమై శుక్రవారం నాడు భార్య తిట్టి కొట్టాడు. ఈ తర్వాత కూతురు 11 నెలల ప్రిన్సీని ఎత్తుకొని తాను సాగు చేస్తున్న కౌలు భూమి దగ్గరకు తీసుకెళ్లాడు. కూతురు కాళ్ల గజ్జెలకు తీగలు చుట్టి.. వాటిని మోటారు స్టార్టర్‌ నుంచి కరెంట్‌ పాస్‌ అయ్యేలా చేశాడు.

దీంతో 11 నెలల చిన్నారి కరెంట్‌ షాక్‌ కొట్టి చనిపోయింది. ఆ తర్వాత రాజశేఖర్‌ అక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే సమయంలో మరో రైతుకు ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన ఆ రైతు గ్రామస్తులకు సమాచారం అందించి.. ఘటనా స్థలం దగ్గరికి వెళ్లారు. కరెంట్‌ షాక్‌తో చిన్నారి పాదాలు మాడిపోయాయి. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లి సునీత గుండెలాగేలా రోదించింది. నిందితుడి పరిస్థితి విషమంగా ఉంది. అతడికి ములుగులోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story