కర్ణాటకలోని బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం హోస్కోట్ గ్రామీణ జిల్లా శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోస్కోట్-దాబాస్పేట్ జాతీయ రహదారి (NH-648) లోని M సత్యవర గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హోస్కోట్ నుండి దేవనహళ్లికి ప్రయాణిస్తున్న XUV 700 కారు ఒక మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది. మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన తర్వాత కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి క్యాంటర్(ఐచర్)ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మరో కారు కూడా ఇరుక్కుంది. వరుసగా నాలుగు వాహనాలు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను హోస్కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతులందరూ బెంగళూరులోని కొత్తనూర్ నివాసితులని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే వారి గుర్తింపును ఇంకా నిర్ధారించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.