నైరుతి ఢిల్లీలోని పాలం జిల్లా, సాధ్ నగర్‌లో బుధవారం నాలుగు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించగా, మరో ముగ్గురిని ఆసుపత్రిలో చేర్చారు.
నివేదికల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది నుంచి పది మంది సభ్యులు భవనంలో చిక్కుకుపోయారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే.. అగ్నిమాపక శాఖ, ఢిల్లీ పోలీసులకు చెందిన పలు వాహనాలు, అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుండి పై అంతస్తులకు వ్యాపించడంతో ఆ కుటుంబం గదులలో చిక్కుకుని పోయారు. ఆ కుటుంబం గ్రౌండ్ ఫ్లోర్‌లో సౌందర్య సాధనాలు, ఇతర దుకాణాలను కలిగి ఉండగా, పై అంతస్తులలో నివసిస్తోంది.
అధికారుల ప్రకారం, ప్రమాదంలో గాయపడిన ముగ్గురు పిల్లలను పాలంలోని దివ్య ప్రస్థ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ వారికి చికిత్స జరుగుతోంది. నాలుగు అంతస్తుల భవనంలోని ఒక భాగంలో మంటలు చెలరేగగా, పొగ వేగంగా భవనం అంతటా వ్యాపించి, కుటుంబ సభ్యులు లోపల చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అవిశ్రాంతంగా శ్రమించారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణం కోసం పోలీసులు, అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలంలో ఉండి దర్యాప్తు చేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాతే కారణం తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.