శనివారం సాయంత్రం పంజాబ్ లోని బటిండాలో డాక్టర్ దినేష్ బన్సాల్ అనే వైద్యుడిపై హత్యాయత్నం చేసినందుకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం తల్వాండి సబ్ డివిజన్‌లోని గుర్సార్ గ్రామ సమీపంలో నిందితులను అరెస్టు చేసినట్లు భటిండా రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి), ఎస్‌పిఎస్ పర్మార్ తెలిపారు. నిందితులను ప్రదీప్ సింగ్, దేవిందర్ సింగ్, పరమవీర్ సింగ్, సుఖ్‌ప్రీత్ సింగ్, గుర్భేజ్ సింగ్, బల్వీందర్ సింగ్, బిను సింగ్‌లుగా గుర్తించామన్నారు. వీరంతా జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ మన్‌ప్రీత్ సింగ్ సహాయకులని ఐజిపి పర్మార్ తెలిపారు.
నిందితుల నుండి నేరానికి ఉపయోగించిన రెండు ఆయుధాలు, ఒక ఎస్‌యూవీ స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిందితులను పట్టుకోడానికి పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో బిను కాలికి బుల్లెట్ గాయమైంది. శనివారం సాయంత్రం, డాక్టర్ బన్సాల్ తన నర్సింగ్ హోమ్‌లో ఉండగా.. పేషెంట్ల లాగా లోపలి వచ్చిన ఇద్దరు ఆయన్ను కాల్చారు. వారి సహచరుడు ఆసుపత్రి వెలుపల వేచి ఉన్నాడు. కాల్పులు జరిపిన తర్వాత ముగ్గురు మోటార్ సైకిల్‌పై పారిపోయారు.
ఈ ఘటన ఆస్పత్రి పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. తొడపై తుపాకీ గాయం కారణంగా బన్సాల్ భటిండాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉంది. నిందితులు బాధితుడి నుంచి 3 లక్షలు డిమాండ్ చేస్తున్నారని ఐజీపీ తెలిపారు.